మంగళవారము, జనవరి 8

ఒక సంవత్సరంలో బైబిల్

ఆదికాండం 20–22; మత్తయి 6:19–34

 

ఈ రోజు బైబిల్ పఠన

మత్తయి 6:25–34

 

మూలవాక్యం

మీలోనెవడు చింతించుట వలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? మత్తయి 6:27

ఎప్పుడూ చట్టబద్ధంగా యథార్థంగా నడుచుకునే ఒక వ్యక్తికి ఈ వాయిస్ మెయిల్ వచ్చింది.  “నేను ఫలానా ప్రాంతం పోలీసు అధికారిని. ఈ నంబరుకు నాకు ఫోన్ చెయ్యండి.” వెంటనే ఆ వ్యక్తిలో ఆందోళన మొదలైంది- తానేమైనా నేరం చేశాడేమో. ఫోన్ చెయ్యడానికి జంకాడు. ఏమి జరిగి ఉంటుందో ఉహించుకుంటూ నిద్రకు దూరమయ్యాడు. తనకేదో ముప్పు వాటిల్లనున్నదని భయపడ్డాడు. ఆ పోలీసు అధికారి మళ్ళీ ఫోను చెయ్యలేదు. కానీ ఆ వ్యక్తి ఆందోళన తగ్గడానికి వారాలు పట్టింది.

యేసు ఆందోళన గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు: “ఆందోళన చెందడం ద్వారా మీలో ఎవరైనా మీ  జీవిత కాలానికి ఒక గంట కలుపుకోగలరా?” (మత్తయి 6:27). బహుశా మనం ఆందోళన చెందే ధోరణి గురించి ఇది మనల్ని ఆలోచించడానికి సహాయం చేస్తుంది.  ఎందుకంటే అప్పుడున్న పరిస్థితికి ఆందోళన ఏ మాత్రం తోడ్పడదు.

సమస్యలు మనలను కమ్ముకున్నప్పుడు మనం ఈ రెండంచెల విధానం అనుసరించవచ్చు. చర్య తీసుకుని దేవునిపై నమ్మకం పెట్టుకొవడం. సమస్యను తప్పించుకోడానికి మనం చెయ్యగలిగినదేమైనా ఉంటే ఆ దారిన పోదాం. మనం అనుసరించబోయే మార్గంలో తోడుండమని దేవుణ్ణి అడుగుదాం. మనం చేయగలిగింది ఏమీ లేనప్పుడు, దేవుడు మాత్రం ఎటూ తోచని పరిస్థితుల్లో ఎప్పుడూ చిక్కుకోడని గ్రహించి హాయిగా ఉందాం. ఆయన మన పక్షంగా, ఎప్పుడైనా సరే జోక్యం చేసుకోగలదు. ఎప్పుడైనా సరే మన పరిస్థితిని విశ్వాసంతో ఆయన చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉండవచ్చు.

ఆందోళన పడవలసిన సమయం వచ్చినట్టు అనిపిస్తే దావీదు రాజు తన కష్టాలనూ ఆందోళనలనూ ఎలా ఎదుర్కున్నాడో ఆ  దైవ ప్రేరిత వాక్కును గుర్తు చేసుకుందాం: “నీ చింత యావత్తూ యెహోవా పై మోపుము. ఆయన నిన్ను ఆదుకొనును” (కీర్తన 55:22). ఆందోళనకు ఎంత శ్రేష్టమైన ప్రత్యామ్నాయం!

 

—డేవ్ బ్రానన్

ఈ రోజు దేవునికి ఇచ్చెయ్యవలసిన దిగుళ్ళు ఏవి ఉన్నాయి?